సీయోను కొండ దేవాలయము ఆగష్టు 15 వ తేది, 2000 సంవత్సరమున బ్రదర్. హోసన్న గారిచే గుంటూరు జిల్లా, సీతానగరములో ప్రారంబించబడినది. దేవుడు బ్రదర్. హోసన్న గారికి ఆజ్ఞాపించినప్రకారమ 3 నెలల 15 రోజులు మౌనఃప్రార్ధన చేసి ఈ మందిరమును ప్రారంభించెను. మౌనఃప్రార్ధన యొక్క విశిష్టత ఏమన ఈ లోక పరమైన ప్రభావములను ఆధ్యాత్మికముగా బందించి దేవుని యొక్క అమూల్యమైన స్వరమును వినుటయే. నిశబ్ధమైన మౌనఃప్రార్ధన సమయములో, ఆత్మ దేవునితో అనుసంధింపబడుట ద్వారా దేవుని యొక్క నిర్ధేశత్వమును పొందుకొనగలము.
సీయోను కొండ దేవాలయము కృష్ణా నదీ తీరమున నిర్మింపబడుట వలన పరిశుద్ధ దేవుని ఆరాధించుటకు అనుకూలమైన వాతావరణమును కలిగియున్నది. అంతేగాక, ఈ మందిరము ఒక కొండపైన నిర్మించబడుట చేత ఆహ్లాదకరమైన పచ్చిక బయళ్ళతో సుందరమైన ఉనికిని కలిగి బహు దీవెనకరముగా ఉన్నది. ఈ మందిరమును దర్శించిన వారు పవిత్రాత్మను ధ్యానించుటలో ఎంతగానో సంతోషించుచున్నారు. ధ్యానము అనగా మన యొక్క ఆత్మ పరిశుద్ద దేవుని పైన కేంద్రీకరించుట. మానవ సంబంధమైన ఆలోచనలను మనస్సు నుండి తీసివేసి దేవుని పైన దృష్టించుటయే ధ్యానము.
బ్రదర్. హోసన్న గారు ప్రతీ నెల మొదటి మంగళవారము సీయోను కొండ దేవాలయమును దర్శించి సంఘ సభ్యులతో దేవుని ఆరాధించెదరు. దేవుని చేత అభిషేకించబడిన దైవజనులు ప్రతీ ఆదివారము ఆరాధనను జరిగించెదరు. మరియు ప్రతీ సంవత్సరము ఆగష్టు 15 నుండి 17 వ తేదీ వరకు "సీయోను ఉత్సవములు" దేవుని ద్వారా ఘనముగా జరుపబడుచున్నవి. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలనుండి అనేక మంది విశ్వాసులు ఈ ఉత్సవాలలో పాల్గొని దేవుని యొక్క ఆశీర్వాదములను పొందుకొనుచున్నరు. ఈ మందిరము కేవలము దేవుని ద్వారా స్థాపింపబడుట ద్వారా, దేవుడు అనేక అద్భుత క్రియలను ఈ మందిరములో చేసెను. పాపపు బందకాల నుండి మరియు దురాత్మల ప్రభావము నుండి అనేక ఆత్మలను దేవుడు విడిపించి తన నిత్య రాజ్య వారసులుగా చేసెను.
పూర్ణ హృదయముతోను, పూర్ణ ఆత్మతోను సీయోను కొండ మందిరములో దేవుని ఆరాధించే వారిని దేవుడు ఆశీర్వదించి అభిషేకించుటలో ఎంతో మక్కువ కలిగియున్నారు కనుక, ఈ వెబ్ సైట్ వీక్షించుచున్న వారికి ఇదే మా ప్రేమ పూర్వక ఆహ్వానము.