క్రైస్తవత్వము అంటరాని మతముగా భావించే భారత దేశములోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన భీమవరం పట్టణమునకు సమీపమున ఉన్న గొల్లపాలెం అనే మారు మూల గ్రామములోని ఒక హైందవ కుటుంబమైన శ్రీ అప్పారావు మరియు శ్రీమతి సుభద్రమ్మ దంపతులకు ఆగష్టు 15, 1952 సంవత్సరమున శ్రీ కరిమిశెట్టి శ్రీరామమూర్తి గారు జన్మించెను. తండ్రి ఒక సామాన్య రైతు మరియు స్థానిక రాజకీయవేత్త కాగా తల్లి గృహిణి.
శ్రీరామమూర్తి గారు ఒక హైందవ ఉమ్మడి కుటుంబములో హిందూ మత సాంప్రదాయాలలో మరియు ఆచారపరమైన సిద్దాంతాలమద్య తన బాల్య జీవితమును గడిపెను. చిన్న తనము నుండి వ్యాపార దృష్టి కలవారై, విద్య యెడల ఆసక్తి లేకపోవుట చేత కేవలము 10వ తరగతితో విద్యాబ్యాసమునకు స్వస్థిపలికెను.
జూన్ 13, 1979 వ సంవత్సరమున శ్రీమతి రంగనాయక గారితో వివాహానంతరము, భీమవరం పట్టణములో స్థిరపడి అనేక వ్యాపారములు ప్రారంభించెను. అనతి కాలంలోనే తన యొక్క వ్యాపార నైపుణ్యము చేత ఉన్నత స్థితిలో జీవించెను. వీరికి ఒక కుమారుడు జన్మింపగా అతనికి శ్రీనివాస్ అని నామకరణము చేసెను. క్రైస్తవ మిషనరీస్ చేత నడపబడుచున్న సెయింట్. మేరీస్ స్కూల్ లో తన కుమారుని చేర్పించుట ఇష్టం లేకపోయిననూ, తన కుమారుడు ఆంగ్ల విద్యాబ్యాసములొ నైపుణ్యం సంపాదించాలని సెయింట్. మేరీస్ స్కూల్ లో చేర్పించెను.
సుఖ సంతోషాలతో ఆనందముగా సాగిపోవుచున్న జీవితములో అకస్మాత్తుగా తన వ్యాపార భాగస్థుల ద్వారా మోసగింపబడి కుటుంబమును పోషింపలేని స్థితికి పడిపోయెను. చేయు ప్రతీ ప్రయత్నము విఫలమవుచుండగా అనేక కష్టతరమైన ఆ దినాలలో, తన పొరుగు వారి సలహా మేరకు ఒక క్రైస్తవ దేవాలయమునకు అయిష్టముగానే వెళ్ళుట ప్రారంబించెను. వ్యాపారములో పోగొట్టుకొనిన దానిని తిరిగి సంపాదించుకోవాలనే తపన మాత్రమే కానీ, దేవుని మీద ఎటువంటి శ్రద్ధ, భక్తి కలుగలేదు.
విచిత్రముగా ఒక దినమున పరిశుద్దాత్మ దేవుడు ప్రత్యక్షమై - "నీవు నా ప్రియ కుమారునివై యున్నావు. పర లోకములో నీ పేరు బ్రదర్. హోసన్నఅని మరియు నీవు నా పరిచర్య చేయవలసిన వాడవై ఉన్నావనెను". క్రైస్తవత్వము యెడల పూర్తి అవగాహన లేకపోవుట వలన, మరియు దేవుని పరిచర్య చేయుట ఎంతో భారమైన పనిగా భావించెను. కాగా, ఎటువంటి అర్హత, విద్యాభ్యాసము మరియు బైబిల్ పరిజ్ఞానము లేక పోవుటచేత దేవుని పిలుపును వ్యతిరేకించెను.
అట్టివిధముగా దేవుని యొక్క పిలుపును వ్యతిరేకించుట ద్వారా, దేవుని చేత మొత్తబడిన వారై, తన సర్వమును కోల్పోయెను. తన కుటుంబమును కూడా పోషించలేని స్థితిలో దీనమైన జీవితాన్ని జీవించుచున్నసమయములో పరిశుద్దాత్మ దేవుడు మరలా ప్రత్యక్షమై - "నీవు నా పరిచర్య చేయవలసిన వాడవై ఉన్నావనియు, నీ ఆత్మకు రక్షణ కలుగ చేసి, విమోచన అనుగ్రహించి యున్నను కావున నీ జీవితమును నాకు సమర్పించవలసిన వాడవై ఉన్నావనెను". ఈ పిలుపు శ్రీరామమూర్తి గారిని ఆలోచనలో పడవేసెను. లోకములో ఎందరో ఉన్నతమైన అర్హతలు కలిగి, గొప్ప జ్ఞానము కలిగియుండగా, ఒక హైందవ కుటుంబములో జన్మించి, ఎటువంటి అర్హతలు లేని, బైబిలు పరిజ్ఞానము లేని ఒక సామాన్యమైన వ్యక్తిని దేవుడు ఎందుకు ఎన్నుకున్నారో తెలియని స్థితిలో ఉండెను. అటు వ్యాపారములో తీరని నష్టము మరియు ఏ ప్రయత్నము ఫలించుట లేదు గనుక, దేవుని వైపు తిరిగి - నా కుటుంబమును నీవు పోషించినయెడల నేను నీ పరిచర్య చేసెదనని తీర్మానము చేసుకొనెను. అందుకు దేవుడు ఈ క్రింది షరతులతో అంగీకరించెను.
ఫై షరతులకు అంగీకరించి, దేవుడు ఆజ్ఞాపించిన ప్రకారము 1995 సంవత్సరంలో, మే నెలలో 21 దినములు ఆహార పానీయములు విడిచి సంపూర్ణ ఉపవాసముతో దేవుని చేత అభిషేకించబడి, దేవుని యొక్క వరములను పొందుకొని దేవుడు ఆజ్ఞాపించిన అనేక నియమ నిబంధనల ప్రకారము బ్రదర్. హోసన్న (అన్నయ్య గారు) సేవా జీవితమును ప్రారంబించెను.
1995 సంవత్సరం ఏప్రిల్ 4వ తేదీన కేవలము ముగ్గురు వ్యక్తులతో "పరమ యెరుషలెము" ప్రార్ధనా మందిరమును దేవుని ప్రణాళిక చొప్పున ప్రారంబించెను. దేవుని కృప ద్వారా అనతి కాలములోనే ఘనమైన నాలుగు దేవాలయాలు కలిగి, 22 మంది సేవకులతో, 400 మంది అభిషక్తులతో, అనేక వేలమంది విశ్వాసులతో దేవుని యందు భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ సేయుచున్నారు.
గడచిన 18 సంవత్సరముల సేవా జీవితములో, కేవలము పండ్లు మరియు పండ్లరసాలతో జీవించుచు, దేవదేవునితో ప్రత్యక్ష సంబంధముగలిగి, నిరంతరము దేవుని ధ్యానములో పరమేశ్వరుని పాదముల చెంత వినయ విధేయతలతో నిరాడంబరముగా ఆయన పరిచర్యను కొనసాగిస్తున్నారు. పరిశుద్ధాత్ముని ద్వారా అనేక వాగ్ధానములను పొందుకొని వాటి నెరవేర్పు కొరకు కేవలము దేవుని మహిమార్ధమై తండ్రియైన దేవుని పాదముల చెంత విజ్ఞాపన చేయుచున్నారు.
ఏ పని నిమిత్తమై దేవుడు బ్రదర్. హోసన్న గారిని ఎన్నుకున్నారో, ఆ పని సంపూర్తి అయ్యేవరకు, కేవలము దేవుని నామ మహిమార్ధమై, మరి ఉన్నతముగా పరమ తండ్రి పరిచర్యలో కొనసాగుచూ, ఆ మహిమకరమైన "పరమ యెరూషలేము" మందిర నిర్మాణము కొరకు దేవుడు శక్తిమంతునిగా నిలువబెట్టి ఆశీర్వదించును గాక !
-: ఆమెన్