నా పేరు రజని. మాది పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపమున ఉన్న శృంగవృక్షం అనే గ్రామము. నాకు 12 సంవత్సరాల వయస్సులో 1996 వ సంవత్సరమున సుమారు 6 నెలలు నేను కాళ్ళు నొప్పులతో విపరీతమైన భాదను అనుభవిస్తున్న రోజులవి. నేలపై నిలబడుట చాల కష్టతరముగా వుండేది. ఒంటరిగా నడవలేని స్థితి నాది. అంతే కాకుండా నా మెడ నరాలు కూడా విపరీతమైన నొప్పి. తల ఒక ప్రక్క నుండి ఇంకొక ప్రక్కకు త్రిప్పలేక పోయేదానిని. 6 నెలలకు పైగా ఆహారం తీసుకొనలేకపోయాను. కనీసం మంచినీళ్ళు త్రాగటం కూడా కష్టంగా ఉండేది. విపరీతమైన జ్వరంతో, ముక్కు నుండి రక్తం కారుతూ ఉండేది. నా తల్లియన 'మేరీ' వృత్తి రీత్యా నర్స్ కావటం వలన, అనేక హాస్పిటల్స్ లో చూపించారు. అన్ని పరీక్షలు చేసేవారు కానీ నా అనారోగ్యమునకు కారణము చెప్పేవారు కాదు. కొందరు కీళ్ళ వాతం అని, కొందరు నరాల బలహీనత అని మరి కొందరు మలేరియా జ్వరం అని చెప్పేవారు. దినమునకు ఒక్క గంట కూడా నిద్ర పట్టక బహు వేదనను అనుభవించాను. ఒక సమయములో డాక్టరు గారు వచ్చి నేను ఇంక ఎంతో కాలము బ్రతకనని చెప్పి హాస్పిటల్ నుంచి ఇంటికి పంపించేశారు.
నా తల్లితండ్రులు నేను బ్రతుకుతాను అన్న ఆశను కోల్పోయి దీనంగా రోదిస్తున్న ఆ దినాలలో, నా తల్లి యొక్క సహోద్యోగి సలహా మేరకు భీమవరం పట్టణంలోని పరమ యెరుసలెము మందిరమునకు నన్ను తీసుకొని వెళ్ళారు. సంఘ కాపరియైన బ్రదర్. హోసన్న గారికి నా యొక్క సమస్యను వివరించి ప్రార్ధనా సమయము కోరగా, ఆయన మా గృహమును దర్శించి ప్రార్ధన చేస్తానని చెప్పారు. చెప్పిన విధముగా బ్రదర్. హోసన్న గారు మా ఇంటికి వచ్చి ప్రార్ధన చేసి ఈ విధముగా చెప్పారు. నేను ఒక భయంకరమైన దురాత్మచేత పీడించబడుతున్నానని చెప్పి విడుదల కొరకు ప్రార్ధన చేసి వెళ్ళిపోయారు. ఎటువంటి కానుకలు అంగీకరించకుండా కేవలము మంచి నీళ్ళు మాత్రమే స్వీకరించారు. ఈ రోజు మొదటి రోజు నేను పూర్తిగా రాత్రంతా నిద్రపోయిన రోజు. కానీ, ఆరోగ్యంలో ఎటువంటి మెరుగుదల లేదు. నా తల్లితండ్రులు మరలా నన్ను హాస్పిటల్ లో చేర్పించటానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ విషయం తెలుసుకొన్న బ్రదర్. హోసన్న గారు, ఎట్టి పరిస్థితులలోను హాస్పిటల్ లో చేర్పించ వద్దని విజ్ఞప్తి చేశారు. కానీ నా తల్లి తండ్రులు నన్ను హాస్పిటల్ లో చేర్పించారు. డాక్టర్స్ నా మెడ దగ్గర ఆపరేషన్ చేసి కొంత భాగాన్ని బయాప్సి నిమిత్తము బొంబాయికి పంపించారు. రిపోర్టులు వచ్చిన తరువాత పిలుస్తామని ఇంటికి పంపేశారు. ఇంటికి వచ్చిన మరుసటి రోజు, ఆపరేషన్ చేసిన మెడ ప్రాంతం తెరుచుకొని రక్తం కారుట మొదలుపెట్టినది. వెంటనే మరలా హాస్పిటల్ కు వెళ్ళగా డాక్టర్లు మరలా కుట్లు వేసి ఇంటికి పంపారు. మరలా, ఇంటికి వచ్చిన మరుసటి రోజే గాయం తెరుచుకుంది. మరలా హాస్పిటల్ కు వెళ్ళగా కుట్లు వేశారు. ఇలా అనేక సార్లు జరిగినా, గాయం మాత్రం తగ్గటం లేదు. ఈ సమయంలో బ్రదర్. హోసన్న గారు మా గృహమును దర్శించి కన్నీళ్ళతో నా కొరకు ప్రార్ధన చేసి ఈ విధముగా ప్రవచించారు - "దేవుని నామ మహిమార్ధమై, ఈ రోజు మొదలుకొని 15 దినాలలో నీ గాయం కట్టుబడుతుంది" అని వెళ్ళిపోయారు. నేను నమ్మలేదు. 14 వ రోజు రాత్రి కూడా పడుకొనే ముందు అద్దంలో నా గాయాన్ని చూసుకొని, ఇన్ని రోజులలో తగ్గని గాయం ఒక్క రాత్రిలో ఎలా తగ్గుతుంది అని అనుకోని పడుకున్నాను. మరుసటి రోజు నా పడక మీద నుండే నా గాయాన్ని అద్దంలో చూసుకున్నాను. ఆశ్చర్యం, అద్భుతం, గాయం పూర్తిగా తగ్గిపోయింది. నా కన్నులను నేనే నమ్మలేదు. 15 వ రోజు బ్రదర్. హోసన్న గారు మరలా మా గృహమును దర్శించి నా కొరకు ప్రార్ధన చేసి దిన దినము సంపూర్ణ ఆరోగ్యము పొందుదువని చెప్పి వెళ్లి పోయారు. ఆ దినమున నా బరువు 30 కేజీలు మాత్రమే. మరుసటి రోజుకు 35 కేజీలకు పెరిగాను. క్రమముగా ఆకలి వేయటం ప్రారంబించింది. కొద్ది దినాలలోనే సంపూర్ణమైన ఆరోగ్యమును పొందుకొని యేసు క్రీస్తు ను నా రక్షకునిగా అంగీకరించాను.
కేవలం దేవుని శక్తి వలన మాత్రనే నేను స్వస్థత పొందుకున్నాను అంతేకానీ మందుల వలన కాదు. దురాత్మ శక్తుల నుండి దేవుడు నన్ను విడిపించాడు. నేను ఇప్పుడు సంపూర్ణ ఆరోగ్యముతో ఉన్నాను అంతే కాకుండా నాకు వివాహము కూడా అయింది. ఈ సాక్ష్యం ను దేవుడు దీవించి దీనిని చదివిన వారిని దీవించును గాక! ఆమెన్…