మన తండ్రియైన యెహోవా నామమున, మన రక్షకుడైన యేసు క్రీస్తు నామమున మరియు పరిశుద్ధాత్మ దివ్యమైన నామమున మిమ్ములను హెవెన్ లైట్ మినిస్ట్రీస్ నకు ప్రేమతో ఆహ్వానిస్తున్నాము.
క్రీస్తు పూర్వం సుమారు 2000 సంవత్సరాల క్రితము, మన తండ్రియైన యెహోవా అబ్రహాముతో ఇలా మాట్లాడెను. -యెహోవా- "నీవు లేచి నీ దేశమునుండియు నీ బందువులనుండియు నీ తండ్రి ఇంటనుండియు బయలుదేరి నేను నీకు చూపించిన దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదముగ నుందువు. నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను; నిన్ను దూషించువారిని శపించెదను; భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదించబడును... (ఆది కాండము 12వ అధ్యాయము)
దేవాది దేవుడు అబ్రహామునకు అనుగ్రహించిన కాలము సమీపించినపుడు, దేవుని యొక్క వాగ్ధాన ప్రకారము, దేవుడు అబ్రహామును సమస్త జనములకు తండ్రిని చేసెను. పరిశుద్ధ గ్రంథములో దేవుని చేత ఆశీర్వదించబడిన మొట్ట మొదటి భక్తుడు అబ్రహాము. అదే విధముగా, దేవుడు అనేక మంది ప్రవక్తలను ఎన్నుకుని తన ప్రజలను నడిపించినట్లుగా మనము బైబిల్ గ్రంథములో చూస్తాము. వారిలో కొందరు మోషే, దానియేలు...
దేవుడు తన ప్రజల యెడల లెక్కించలేని ప్రేమను కనపరుస్తూ, తన స్వకీయ జనమైన మనలను రక్షించుకోవాలని, తన కుమారుడైన యేసు క్రీస్తును ఈ లోకానికి పంపెను. కొత్త నిబంధన ప్రకారము, యేసు క్రీస్తు తన రక్తమును మనకొరకు చిందించి, కలువరి సిలువలో మరణించి, పునరుద్ధాన దినమున సజీవుడై లేచెను. యేసు క్రీస్తు ప్రభువు తన పరిశుద్ధ రక్తము ద్వారా మన జన్మ, కర్మ పాప బంధకాలనుండి విడిపించి, ఆ శాశ్వత రాజ్యమైన పరలోక రాజ్యములో ప్రవేశించటానికి మనలను అర్హులను చేసెను.
కొత్త నిబంధన తరువాత కూడా, దేవాది దేవుడు తన ప్రజలందరూ నిత్య రాజ్యములో ప్రవేశించబడాలని అనేక మంది దైవజనులను అభిషేకించి తన వర్తమానమును పంపుట ద్వారా, ఒక తల్లి తన పిల్లలను మరుచునేమో కానీ, నేను మాత్రము నా పిల్లలను మరచే వాడను కాదని నిరూపించెను. క్రీస్తు శకము 2000 సంవత్సరాల తరువాత కూడా, దేవుని యొక్క ప్రేమ, దయ తన ప్రజలమీద కొనసాగిస్తూనే వున్నాడు.
1950వ సంవత్సరములో, దేవుడు తన దక్షిణ హస్తమును భారతదేశమునకు విస్తరించి, ఒక సామన్యమైన, ఒక హైందవ కుటుంబములో జన్మించిన మానవుని ఎన్నుకుని, పాపపు బంధకాలనుంచి విడిపించి, దేవుని కృపను అనుగ్రహించి, దేవుని హస్తాలతో అభిషేకించి బ్రదర్. హోసన్నగా రూపింపచేసి తన పని కొరకు స్థిరపరచెను. 1995వ సంవత్సరములో దేవుడు "పరమ యెరూషలేము" అనే ప్రధాన మందిరమును బ్రదర్. హోసన్న గారి ద్వారా స్థాపించి దేవుడు ఈ విధముగా వాగ్ధానము చేసెను - పరమ తండ్రియైన నేను, అనేక జనములకు తండ్రిగా నిన్ను ఆశీర్వదించెదను, మరియు బ్రదర్. హోసన్న ద్వారా పరమ యెరూషలేమును నిర్మించి దానిని అనేక దేశములకు మూల స్తంభముగా చేయుటకు ఇష్టపడుచున్నాను. దేవుడు అనుగ్రహించిన ఆ వాగ్ధానం నిజ స్వరూపముగా ఈ హెవెన్ లైట్ మినిస్ట్రీస్ స్థాపించబడినది.
ఈ వెబ్ సైట్ వీక్షిస్తున్న మీకు అనేక సందేహములు కలుగవచ్చు. శాస్త్రీయ మరియు సాంకేతికమైన అభివృద్ధిలో ముందుకు దూసుకుపోతున్న ఈ ప్రపంచములో దేవుడు అద్భుతకార్యాలు చెయ్యగలడా? ఎటువంటి జ్ఞానము లేని, ఎటువంటి విద్యాబ్యాసము లేని ఒక సామాన్యమైన వ్యక్తి చేత పరమ యెరూషలేము నిర్మించగలడా? ఇది నమ్మశక్యమా?...
హెవెన్ లైట్ మినిస్ట్రీస్ నకు చెందిన మేము, మా యొక్క విశ్వాసము దేవుని వాక్కు మీద ఆధారపడుతుంది. ఆదిలో దేవుడు చేసిన అనేక వాగ్దానాలలో ఏ ఒక్క వాగ్ధానము కూడా నిరర్ధకము కాలేదు. సాంకేతిక విప్లవం కొత్త పుంతలు తొక్కుతున్న ఈ దినములలో కూడా ఆయన చేసిన వాగ్దానాలను నెరవేర్చగల శక్తిమంతుడు. దేవుడు పరమ యెరూషలేమును నిర్మించబోవుచున్నాడు కనుక, మేము మరింత భక్తితో, మరింత ప్రార్థనతో, మరింత పరిశుద్ధతతో ఆ మందిరములోనికి ప్రవేశించాలనే నిరీక్షణ మా హృదయాలలో రగులుచున్నది...
దేవదేవుని ద్వారా పరమ యెరూషలేము నిర్మించబడాలనేది మా నిరంతర ధ్యానము. పరమ యెరూషలేము ఎటువంటి రూపములో, ఎటువంటి విధముగా నిర్మింపబడుతుందనేది ప్రస్తుత క్షణములో వివరముగా చెప్ప వల్ల పడుటలేదు. కాని, ఆ మహా మందిరమును మా ఆత్మీయ నేత్రాలతో నిశితముగా చూచుచున్నాము. ఇది పరిశుద్దాత్ముని ప్రణాళికగా, ఇది సర్వ శక్తుని రూపకల్పనగా, మరియు దేవుని మహా శక్తి ద్వారా ఆశ్చర్యకరముగా నిర్మింపబడును గాక!!!
దేవుని యొక్క వాక్యమును గాని, దేవుని యొక్క వాక్కును గాని హెవెన్ లైట్ మినిస్ట్రీస్ కరాఖండిగా ప్రకటిస్తున్నది. హెవెన్ లైట్ మినిస్ట్రీస్ నందు, పరిశుద్దాత్మను మేము నియంత్రించుటకు ప్రయత్నించము, ఎందుకనగా - పరిశుద్దాత్మ మమ్ములను నియంత్రించి తన కార్యమును జరిగించును. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు అయిన దేవుని జ్ఞానము చేత పరమ యెరూషలేము మందిరము నిర్మించబడుతుంది అంతే కాని, ఈ లోక పరమైన జ్ఞానము చేత కాదు. అందువలన మేము సర్వ శక్తుడైన దేవుని సహాయము తప్ప, మనుష్యుల సహాయము కోరము.