అభిషేకము

హెవెన్ లైట్ మినిస్ట్రీస్ వెబ్ సైట్ ను వీక్షించుచున్న మీకు మన ప్రభువును మరియు రక్షకుడైన యేసు క్రీస్తు నామమున శుభాబి వందనములు తేలియజేయుచున్నాను. నేను ఒక గొప్ప వ్యక్తిని గానీ లేక ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిని గానీ ఎంతమాత్రమూ కాదు. కానీ నా జీవితములో, యేసు యొక్క గొప్ప ప్రేమ, కనికరమును వివరించుటకు ప్రయత్నిస్తున్నాను. నా హృదయ అంతరంగాల నుండి ఈ సాక్ష్యమును కేవలము దేవుని మహిమ పరచుటకు వ్రాయుచున్నాను. ఎవరినీ కించపరచటానికి కాదు.

నా పేరు బి. రాంబాబు, నేను కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలములోని నిడమర్రు అనే గ్రామములో జన్మించాను. నా బాల్య జీవితమంతయు పశువుల కాపరిగా గడచినది. నేను ఒక పశువుల కాపరి అయినప్పటికీ ఎటువంటి దురఅలవాట్లకు గురి కాలెదు. నా 33 వ యేట నా వివాహము జరిగినది.

నా వివాహానంతరము, చిన్న చిన్న కుటుంబ సమస్యలవలన నేను మద్యము సేవించుట ప్రారంబించి త్రాగుడుకు బానిసనైపోయాను. ఇది నా జీవిత పతనమునకు తొలి మెట్టు అని నేను గ్రహించలేకపోయాను. అంతేకాక, నా జీవితమంతయు ఒక వ్యభిచార గృహముగా మారిపోయినది. ఎవ్వరూ చేయనటువంటి పాపకార్యములు నేను చేశాను. పాపము చేయుటలో నేను ఘనుడనుగా భావిస్తారు. ఇంతకంటే ఎక్కువగా నేను వ్రాయదలచుకోలేదు. నా హృదయ వేదనను మీరు అర్ధం చేసుకుంటారని భావిస్తూ నా తరువాత పరిస్థితులను వివరిస్తాను. చిన్ననాటి నుండి కుడా ఎందుచేతనో కారణం తెలియదు కానీ, క్రైస్తవులంటే నాకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎంతో మంది క్రైస్తవ సేవకులను విమర్శించుట మరియు వారి సభలను ఆటంక పరచి వారి వస్తువులను పాడు చేస్తూ ఉండేవాడిని. ఈ విధముగా నా జీవితం పాపముతో నిండిన దినాలలో నాకు భయంకరమైన వ్యాధి సంబవించినది. అనేక హాస్పిటల్స్ కు వెళ్ళి అనేక మంది వైద్యులను సంప్రదించాను కానీ, నాకు సంక్రమించిన వ్యాది ఏమిటో ఎవ్వరూ నిర్ధారించలేకపోయిరి. ఒకానొక స్థితిలో నరాల బలహీనత వలన, కాళ్ళు, చేతులు కదపలేని స్థితికి నేను చేరుకున్నాను. నన్ను ఆదరించటానికి ఎవ్వరూ లేక ఒంటరిగా జీవించుచూ జీవితము మీద ఆశను కోల్పోయాను. బ్రతుకుతాను అనే నమ్మకము లేక దీనముగా గడుపుచున్న ఆ దినాలలో, ఒక శుభదినమున ఒక స్త్రీ నన్ను బ్రదర్. హోసన్న గారి వద్దకు తీసుకు వచ్చి నా కొరకు ప్రార్ధన చేయమని కోరగా బ్రదర్. హోసన్న గారు నాతల మీద చేయి వేసి ప్రార్ధన చేశారు. ఆ సమయములో ఒక గొప్ప వెలుగు నా మీదకు పడి నా నరాలలో సడలింపు కలిగింది. నా కాళ్ళను, నా చేతులను కదపగలిగాను. అంతేకాక, అనతి కాలములోనే సంపూర్ణమైన ఆరోగ్యము పొందుకున్నాను. డిసెంబర్ 18, 1995 వ సంత్సరమున దేవుడు నన్ను దర్శించి, నా పాపాల నుండి, నా అతిక్రమముల నుండి నన్ను విడిపించి తన పునరుద్ధాన శక్తితొ నన్ను నింపి తన పరిచర్య చేయమని చెప్పారు. దేవుని పిలుపు అందుకున్న సమయానికి నాకు 14 లక్షల ఋణభారము వుంది. అంతేకాక, పోలీస్ స్టేషన్ లో నా మీద 6 కేసులు నమోదైయున్నవి. సేవ ప్రారంభించిన ఆనాటి కాలంలోనే, నా దేవుడు ఋణభారము నుండి నన్ను విడిపించి నన్ను ఆశీర్వదించెను. నాపైన ఉన్న కేసులను కొట్టివేయుటకు దేవుడు కృప చుపారు. ఇప్పుడు నా కుటుంబ సమేతముగా దేవుని సన్నిధిలో ఆనందించుచున్నాను. అంతేకాక నా కుమార్తెల వివాహము కూడా జరిపించటానికి దేవుడు కృప చూపారు.

ప్రియ చదువరీ, అవును, మీ మనస్సులో కలిగిన భావనే నా మనస్సులో కూడా కలిగింది. నా గత జీవిత క్రియలను బట్టి నేను దేవుని కొరకు పనిచేయుటకు అర్హుడను కాను. కానీ, నేను దేవుని వైపు తిరిగినపుడు, దేవుడు నా పాపములన్నింటినీ క్షమించి తన అమూల్యమైన కనికరమును నా యెడల చూపించారు. తన పరిశుద్ధత చేత నన్ను నింపి, తన పని కొరకు నన్ను ఎన్నుకొన్నారు. నశించిపోవుచున్న నాలాంటి అనేక ఆత్మలను రక్షించటానికి దేవుడు తన ప్రియకుమారుని పంపి పాపపుబందకాల నుండి విడిపించెను. తన వైపుకు తిరిగిన వారిని ఎన్నటికీ తృణీకరించేవాడు కాదు నా విమోచకుడైన నా దేవుడు.

18 సంవత్సరాల నా సేవా జీవితములో, దేవుని కొరకు పనిచేయుటకు దేవుడు తన శక్తిని నాకు అనుగ్రహించెను. ప్రస్తుతము నేను పరమ యెరూషలేము దేవాలయములో సువార్తకునిగా, బ్రదర్. హోసన్న అన్నయ్య గారికి జతపని వానిగా దేవుడు నన్ను ఆశీర్వదించెను. నన్ను విడిపించి, విమోచించిన నా విమోచకునికి సమస్త మహిమ కలుగును గాకా! దేవుడు తన మహిమార్ధమై అనేక ఆత్మలను రక్షించును గాకా! ఆమెన్!!!